image

యువత క్రీస్తును కనుగొనేలా సహాయపడండి – మిషనరీ ఉత్సాహాన్ని నూతనీకరించుకోవాలని జీసస్ యూత్‌కు పోప్ లియో XIV పిలుపు

వాటికన్ నగరం, అక్టోబర్ 26, 2026: భారతదేశంలో ప్రారంభమైన జీసస్ యూత్ ఉద్యమం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వాటికన్‌లో సమావేశమైన ఆ ఉద్యమ నాయకులకు పోప్ లియో XIV పిలుపునిచ్చారు. తమ మిషనరీ ఉత్సాహాన్ని నూతనీకరించుకోవాలని, ప్రార్థనలో పాతుకుపోయి ఉండాలని, యువత క్రీస్తును కనుగొని తమ జీవిత పిలుపును గుర్తించేందుకు సహాయపడాలని ఆయన సూచించారు.


ప్రార్థనను బలోపేతం చేయడం, పేదలకు సేవ చేయడం, వివాహాన్ని ఒక దైవ పిలుపుగా ప్రోత్సహించడం వంటి అంశాలపై పోప్ అంతర్జాతీయ జీసస్ యూత్ ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు.


2026 అక్టోబర్ 24వ తేదీ శనివారం, వాటికన్‌లోని పౌల్ VI ఆడియన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసస్ యూత్ ప్రతినిధులు, బిషప్‌లు, గురువులు, సన్యాసులు, మఠవాసులు పోప్ స్వాగతించారు. ఈ సమావేశం ఉద్యమ నాయకులు, ప్రతినిధులు పేతురు వారసుడైన పోప్‌ను తొలిసారిగా కలుసుకున్న ప్రత్యేక సందర్భమని ఆయన పేర్కొన్నారు.


కేరళ నుంచి ప్రపంచవ్యాప్త ఉద్యమంగా


కేరళలో జీసస్ యూత్ ఉద్యమం ప్రారంభమైన తీరును గుర్తుచేసుకుంటూ, కతోలిక కరిస్మాటిక్ రెన్యూవల్ ఉద్యమం నుంచి ఈ సంఘం ఆవిర్భవించిందని పోప్ లియో XIV తెలిపారు. యేసుతో వ్యక్తిగత అనుభవాన్ని పొందిన యువత ప్రేరణతో ఈ ఉద్యమం ప్రారంభమైందని వివరించారు.


చర్చిలో నిజమైన ఆధ్యాత్మిక నూతనీకరణ అనేది క్రీస్తు ప్రేమను అనుభవించడం ద్వారా ప్రారంభమవుతుందని ఆయన నొక్కిచెప్పారు. అనంతరం వివిధ ప్రార్థనా బృందాల్లోని యువతను ఒకచోట చేర్చి, వారి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సమష్టి మిషనరీ సేవగా మలచడంలో జీసస్ యూత్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.


పవిత్ర సింహాసనం నుంచి అంతర్జాతీయ విశ్వాసుల సంఘంగా గుర్తింపు పొందిన పది సంవత్సరాల తరువాత, జీసస్ యూత్ మరింత పరిపక్వమైన చర్చి సంఘంగా ఎదిగిందని పోప్ అన్నారు. కొత్త సవాళ్లను స్వీకరించాలని, మరిన్ని దేశాలకు చేరుకోవాలని, తమ అపోస్తలిక ఉత్సాహాన్ని కోల్పోకుండా ఆధ్యాత్మిక ఫలాలను అందించాలని సభ్యులను ప్రోత్సహించారు.


జీవిత సాక్ష్యం ద్వారా విశ్వాస ప్రకటన


ప్రత్యేకించి క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్న యువ క్రైస్తవులు, యేసుతో తమకున్న స్నేహాన్ని ధైర్యంగా సాక్ష్యమివ్వాలని, భయపడకూడదని పోప్ లియో XIV సూచించారు.


దివ్యబలి పూజలో సజీవంగా ఉన్న క్రీస్తుపై ప్రేమ, తీవ్రమైన అనారోగ్య సమయంలో అజ్నా జార్జ్‌కు ఎలా బలాన్నిచ్చిందో ఆయన గుర్తుచేశారు. క్రీస్తుతో గాఢమైన వ్యక్తిగత సంబంధం ద్వారా ధైర్యం, ఆనందం ఎలా లభిస్తాయో ఆమె జీవిత సాక్ష్యం తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.


కుటుంబాలతో కలిసి పనిచేస్తూ, యువత తమ జీవితాలు దేవుని ప్రణాళికలో ఎంత అందమైన భాగమో గుర్తించేలా సహాయపడాలని జీసస్ యూత్ సభ్యులకు పిలుపునిచ్చారు.


గురుత్వం, సన్యాస జీవిత పిలుపుల ప్రాముఖ్యతను సమర్థిస్తూనే, వివాహం కూడా ఒక దైవ పిలుపు, పవిత్రతను సాధించే మార్గమని ఆయన స్పష్టం చేశారు. వివాహితులైన జీసస్ యూత్ సభ్యులు తల్లిదండ్రులుగా మారి, తమ కుటుంబాలనే మిషనరీ కుటుంబాలుగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. సువార్తను వ్యాప్తి చేయడంలో వారు గురువులతో కలిసి సేవ చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.


ప్రార్థన, సేవ, ఐక్యత


ప్రార్థనకు, పేదలకు సేవ చేయడానికి నమ్మకంగా కట్టుబడి ఉండాలని పోప్ జీసస్ యూత్ సభ్యులను కోరారు. ఇవి ఈ ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే లక్షణాలని ఆయన పేర్కొన్నారు.


విభిన్న సామాజిక నేపథ్యాలు, సంస్కృతులు, భాషలకు చెందిన సభ్యులతో కూడిన ఈ ఉద్యమంలో ఐక్యతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని నొక్కిచెప్పారు.


బిషప్‌లు, గురువులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత పట్ల తండ్రి వంటి ప్రేమతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న దృక్పథంతో వ్యవహరించాలని పోప్ సూచించారు. వివిధ ప్రార్ధనా సంప్రదాయాల మధ్య తలెత్తే భేదాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి, యువత ఆధ్యాత్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.


జీసస్ యూత్ తనలోని యువతరపు తాజాదనాన్ని, ఉత్సాహాన్ని నిలుపుకుంటూ మరింతమంది ప్రజలు క్రీస్తును కలుసుకోవడానికి, తమ ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


కన్యామరియమ్మ, అస్సీసీ పునీత ఫ్రాన్సిస్‌ల మధ్యవర్తిత్వానికి ఈ ఉద్యమాన్ని అప్పగిస్తూ, పోప్ తన అపోస్తలిక ఆశీర్వాదాన్ని అందించారు.


భారతదేశంలో తన ప్రారంభ దశలో ఉన్న ఆనందం, ప్రార్థనా జీవితం, మిషనరీ స్ఫూర్తిని కాపాడుకుంటూనే, మరింత పరిపక్వతతో ఎదగాలని జీసస్ యూత్‌కు పోప్ సందేశం ప్రోత్సాహంతో పాటు ఒక సవాలుగా నిలిచింది.


కాథలిక్ కనెక్ట్ ప్రతినిధి


మూలం: వాటికన్ VA

© 2026 CATHOLIC CONNECT POWERED BY ATCONLINE LLP