- 28 October, 2026
న్యూఢిల్లీ, అక్టోబర్ 22, 2026: కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) తన స్థాపనకు ఎనిమిది దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా కతోలిక సంఘం చేపడుతున్న సమన్వయం, సామాజిక న్యాయం, మతాంతర సంబంధాలు, సంభాషణ, దేశసేవ వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. CBCI సంభాషణ కార్యాలయం, క్రైస్తవ ఐక్యత విభాగం కార్యదర్శి ఫాదర్ డా. ఆంథోనిరాజ్ తుమ్మా రూపొందించిన చారిత్రక సమీక్షలో ఈ విషయాలను వివరించారు.
1944లో స్థాపించబడిన CBCI, అంతకుముందు కతోలిక పీఠాధిపతుల మధ్య జరిగిన సమావేశాల నుంచి పరిణామం చెందుతూ, భారతదేశంలోని మూడు కతోలిక సంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులను — లాటిన్, సీరో-మలబార్, సీరో-మలంకరా సంఘాలను — ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది.
1886లో భారతదేశంలో కతోలిక పీఠాధిపత్య వ్యవస్థ స్థాపించబడినప్పటి నుంచే ఈ సమాఖ్య ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. అంతకుముందు మహాధర్మాధికారుల సమావేశాలు, ప్రాంతీయ పీఠాధిపతుల మండలి సమావేశాలు పరస్పర సహకారానికి మార్గం సుగమం చేశాయి. ఈ క్రమంలో 1944 సెప్టెంబరులో మద్రాసులో జరిగిన సమావేశంలో శాశ్వత జాతీయ సమాఖ్యను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
1962–1965 మధ్య జరిగిన రెండవ వాటికన్ మహాసభ అనంతరం CBCIలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ పీఠాధిపతుల సమాఖ్యల పాత్రను ఈ మహాసభ మరింత బలోపేతం చేసింది. 1966లో CBCI తన నియమావళిని సవరించడంతోపాటు, అదే ఏడాది న్యూఢిల్లీలో పూర్తిస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. “నేటి భారతదేశంలో సంఘం” అనే అంశంతో 1969లో బెంగళూరులో నిర్వహించిన అఖిల భారత సదస్సు, సంఘం తన పరిచర్యను పునరుద్ధరించుకోవడానికి, దేశసేవలో తన పాత్రను విస్తరించుకోవడానికి దోహదపడింది.
1987లో మరో ముఖ్యమైన మైలురాయి నమోదైంది. భారతదేశంలోని మూడు కతోలిక సంప్రదాయ సంఘాలు తమ స్వంత పీఠాధిపతుల సమాఖ్యలను ఏర్పాటు చేసుకునే హక్కును పోప్ రెండవ జాన్ పాల్ ధ్రువీకరించారు. ఆ తరువాత CBCI జాతీయ స్థాయిలో ఉమ్మడిగా ఎదురయ్యే అంశాలు, మూడు సంప్రదాయ సంఘాలకు సంబంధించిన ఉమ్మడి విషయాలపై దృష్టి సారించగా, ఆయా సంఘాలు తమ అంతర్గత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించుకోవడం ప్రారంభించాయి.
ప్రస్తుతం CBCIలో 300 మంది సభ్యులు ఉన్నారు. ఇది భారతదేశంలోని కతోలిక పీఠాధిపతుల కోసం సమన్వయ, సంప్రదింపుల వేదికగా పనిచేస్తోంది. జాతీయ సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరపడం, మతసామరస్యాన్ని ప్రోత్సహించడం, మతాంతర సంభాషణను బలోపేతం చేయడం, క్రైస్తవ ఐక్యత సంబంధాలను పెంపొందించడం, ఉమ్మడి ఆధ్యాత్మిక పరిచర్య కార్యక్రమాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ సమాఖ్య నిర్వహిస్తోందని ఫాదర్ తుమ్మా తెలిపారు.
CBCI తన కార్యకలాపాలను 14 కార్యాలయాలు, యువజనులు, మహిళలు, సామాన్య విశ్వాసుల కోసం ఏర్పాటు చేసిన మూడు మండళ్లు, జాతీయ కేంద్రాలు, ప్రాంతీయ సంస్థల నెట్వర్క్ ద్వారా నిర్వహిస్తోంది. కారిటాస్ ఇండియా, జాతీయ బైబిల్, కేటకెటికల్ మరియు లిటర్జికల్ కేంద్రం, జాతీయ సామాజిక సమాచార, పరిశోధన మరియు శిక్షణ సంస్థ వంటి ప్రముఖ సంస్థలు దీని పరిధిలో పనిచేస్తున్నాయి.
ఇతర క్రైస్తవ సంప్రదాయాలతో ఐక్యతను పెంపొందించేందుకు CBCI, జాతీయ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ద్వారా కూడా కృషి చేస్తోంది. అంతేకాకుండా, భారతదేశంలోని వివిధ క్రైస్తవ సంఘాలను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు జాతీయ చర్చిల సమాఖ్య (National Federation of the Churches in India) ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ మహాధర్మపీఠాధిపతి కార్డినల్ ఆంథోనీ పూలా CBCI అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తిరువల్ల మహాధర్మపీఠాధిపతి ఆర్చ్‌బిషప్ థామస్ మార్ కూరిలోస్ మొదటి ఉపాధ్యక్షుడిగా, కొట్టాయం మహాధర్మపీఠాధిపతి ఆర్చ్‌బిషప్ మార్ మాథ్యూ మూలక్కాట్ రెండవ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మహాధర్మపీఠాధిపతి ఆర్చ్‌బిషప్ అనిల్ జోసెఫ్ థామస్ కౌటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2026 ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన CBCI 37వ ద్వైవార్షిక సర్వసభ్య సమావేశంలో వీరు ఎన్నికయ్యారు.
CBCI పాత్ర కేవలం సంఘ పరిపాలన, సమన్వయానికే పరిమితం కాదని ఫాదర్ తుమ్మా పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమం, సమాజ అభివృద్ధి, మానవతా సహాయం వంటి రంగాల్లో కతోలిక సంఘం అందిస్తున్న సేవలకు కూడా ఈ సమాఖ్య మద్దతునిస్తోంది. వివిధ కార్యక్రమాల సమన్వయం, ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించడం ద్వారా సమాజంతో సంఘానికి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు సేవ చేయాలని CBCI కృషి చేస్తోంది.
ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో, సంఘ సంబంధమైన మరియు జాతీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా CBCI తన నిర్మాణాలను, కార్యకలాపాలను మార్చుకుంటూ వచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని మూడు కతోలిక సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, విస్తృత క్రైస్తవ సమాజంతో ఐక్యతను బలోపేతం చేయడం అనే తన లక్ష్యాలకు కట్టుబడి కొనసాగుతోంది.
రచన: గురుశ్రీ. ఆంథోనిరాజ్ తుమ్మా
© 2026 CATHOLIC CONNECT POWERED BY ATCONLINE LLP