image

జీవిత పిలుపులను గుర్తించడంలో మార్గనిర్దేశం చేసే విశ్వాస బోధనకు CCBI పిలుపు

జలంధర్, అక్టోబర్ 27, 2026: విశ్వాసంలో శిక్షణ పొందడం ద్వారా వ్యక్తులు తమ జీవిత పిలుపును ఎలా గుర్తించగలరు? ఈ ప్రశ్నే జలంధర్‌లో మంగళవారం ప్రారంభమైన 17వ CCBI జాతీయ విశ్వాస బోధన సదస్సుకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా చర్చి నాయకులు, విశ్వాస బోధకులు, సమర్పితులు, యువత పాల్గొన్నారు.


జలంధర్ మేత్రాసనంలోని బిషప్ నివాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సు “వృత్తి పిలుపుల గుర్తింపులో తోడ్పడే విశ్వాస బోధన” అనే అంశంపై కేంద్రీకృతమైంది. వ్యక్తులు తమ జీవిత పిలుపును గుర్తించేందుకు, దేవునితో తమ సంబంధాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు చర్చి వారికి ఎలా తోడుగా నిలవగలదనే విషయాన్ని ఈ సదస్సు పరిశీలిస్తోంది.


సదస్సులో ముఖ్యోపన్యాసం చేసిన మియావో పీఠాధిపతి, CCBI విశ్వాస శిక్షణ కమిషన్ అధ్యక్షుడు బిషప్ జార్జ్ పల్లిపరంబిల్, జీవితంలోని వివిధ దశల్లో ఉన్నవారికి విశ్వాస శిక్షణ మరింత అర్థవంతంగా, సందర్భోచితంగా ఉండాలని పిలుపునిచ్చారు. Venite ad me అనే పత్రాన్ని ప్రస్తావిస్తూ, యువతలో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులు, వృద్ధ తరాలవారిని కూడా విశ్వాస బోధనలో భాగస్వాములను చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వ్యక్తిగత పవిత్రత, పరిచర్యకు అందుబాటులో ఉండే గురువులు ఈ లక్ష్య సాధనకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.


ఢిల్లీ సహాయక పీఠాధిపతి, ఉత్తర ప్రాంత అధ్యక్షుడు బిషప్ దీపక్ వలేరియన్ టౌరో, యువతను చేరుకోవడంలో డిజిటల్ విశ్వాస బోధన అందించే అవకాశాలను వివరించారు. యువతతో అనుబంధాన్ని పెంపొందించడం, యువజన నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, ప్రభువుతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకునేలా వారికి సహాయపడటం చర్చి విధానంలో ప్రధానంగా ఉండాలని ఆయన అన్నారు.


సదస్సు ప్రారంభ రోజున విశ్వాస బోధనలో సామాన్య విశ్వాసుల సేవలను కూడా ప్రత్యేకంగా గుర్తించారు. పోప్ లియో XIV చేత నియమించబడిన ముగ్గురు మార్గదర్శక శాశ్వత విశ్వాస బోధకులను బిషప్ పల్లిపరంబిల్ సత్కరించారు. వారిలో కేరళకు చెందిన బోబన్ సి., తెలుగు ప్రాంతానికి చెందిన లారిసా పీటర్, కర్ణాటకకు చెందిన సునీల్ థామస్ ఉన్నారు. ప్రాంతీయ కార్యదర్శులు, జాతీయ మండలి సభ్యులు, వనరుల నిపుణులను కూడా వారి అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా సత్కరించారు.


కమిషన్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా, బోబన్ సి. రూపొందించిన CCBI విశ్వాస శిక్షణ కమిషన్ డేటాబేస్‌ను ఈ సదస్సులో ఆవిష్కరించారు.


పాల్గొన్నవారికి స్వాగతం పలికిన జలంధర్ పీఠాధిపతి బిషప్ జోస్ సెబాస్టియన్, ఆ ప్రాంతంలో క్రైస్తవ మత చరిత్రను, మేత్రాసనం చేపడుతున్న సువార్తీకరణ కార్యక్రమాలను వివరించే వీడియో ప్రదర్శన ద్వారా స్థానిక చర్చి ప్రయాణాన్ని పరిచయం చేశారు. వైద్య కారణాల వల్ల సదస్సుకు హాజరుకాలేకపోయిన కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఫాదర్ విజయ్ మచాడో, వీడియో సందేశం ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు.


14 ప్రాంతాలకు చెందిన 132 మేత్రాసనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపిక చేసిన సుమారు 100 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. క్రైస్తవ జీవితంలో వివిధ రకాలుగా వ్యక్తమయ్యే దైవ పిలుపులపై సదస్సు తదుపరి సమావేశాలు దృష్టి సారించనున్నాయి. వివాహ సంస్కారం, గురుపట్టాభిషేక సంస్కారాలకు సంబంధించిన విశ్వాస బోధనతో పాటు, ఒంటరి జీవితం మరియు సమర్పిత జీవితాన్ని ఎంచుకోవాలని వివేచిస్తున్నవారికి అందించాల్సిన మార్గదర్శకత్వంపై కూడా చర్చలు జరగనున్నాయి.


వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు, పుస్తక ప్రదర్శనలు పాల్గొనేవారికి తమ అనుభవాలను పంచుకోవడానికి, తమ సమాజాల అవసరాలకు అనుగుణంగా విశ్వాస శిక్షణను మరింత మెరుగుపరచే మార్గాలను పరిశీలించడానికి అవకాశాన్ని కల్పించనున్నాయి.


ప్రారంభ సమావేశానికి హజారీబాగ్ పీఠాధిపతి, కమిషన్ సభ్య బిషప్ ఆనంద్ జోజో; పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సుబిన్; జాతీయ మండలి సభ్యుడు ఫాదర్ డ్యూమింగ్ గోన్సాల్వెస్; ఉత్తర ప్రాంత కార్యదర్శి ఫాదర్ జాన్ వియానీ; మేత్రాసన కార్యదర్శి, స్థానిక సమన్వయకర్త ఫాదర్ మార్కస్ హాన్స్ హాజరయ్యారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఫాదర్ అనిల్ బెనెట్ మరియు వారి బృందం నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంతో సదస్సు ప్రారంభమైంది.


CCBI అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో గారు, ఉప ప్రధాన కార్యదర్శి ఫాదర్ స్టీఫెన్ అలత్తరా గారు సమావేశానికి తమ శుభాకాంక్షలు, ప్రార్థనలను తెలియజేశారు.


అక్టోబర్ 30 వరకు కొనసాగనున్న ఈ సదస్సు ముందుంచిన ప్రధాన సవాలు ఏమిటంటే, విశ్వాస బోధన కేవలం విశ్వాసానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడానికే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ తమ జీవిత పిలుపును గుర్తించడానికి, దేవునితో తమ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి, క్రైస్తవ జీవితంలో సరైన దిశను కనుగొనడానికి తోడ్పడేలా చేయడం.


– ఫాదర్ బోస్కో కార్వాల్హో SDB మరియు వారి బృందం

© 2026 CATHOLIC CONNECT POWERED BY ATCONLINE LLP