image

ప్రజలను హృదయంలో మోసుకెళ్లాలని కొత్త పీఠాధిపతులకు పోప్ లియో పిలుపు

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 11, 2026: క్రీస్తు మంచి కాపరి హృదయాన్ని అలవరచుకుని, యేసుకు దగ్గరగా ఉంటూ తమకు అప్పగించబడిన ప్రజలకు తోడుగా నడవాలని పోప్ లియో కొత్తగా నియమితులైన బిషప్‌లకు పిలుపునిచ్చారు.

Edifice-News


“బిషప్‌లు: చర్చిలోను, నేటి ప్రపంచంలోను సమైక్యతకు సేవకులు” అనే అంశంపై జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న బిషప్‌లతో గురువారం సమావేశమైన సందర్భంగా పోప్ ఈ పిలుపునిచ్చారు.


బిషప్‌ల మధ్య ఉన్న ప్రత్యేకమైన సోదరభావాన్ని ప్రస్తావిస్తూ, వారు ఒంటరిగా నడవడం లేదని పోప్ లియో అన్నారు. తాము సేవ చేస్తున్న ప్రజల ఆశలు, కలలు, జీవితాల పట్ల ఉమ్మడి బాధ్యతలోనే బిషప్‌ల పరిచర్యకు పునాది ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బిషప్ హృదయంలో ఒక స్థానం కలిగి ఉండాలని, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఇప్పటికే క్రీస్తు హృదయంలో స్థానం ఉందని ఆయన గుర్తుచేశారు.


బిషప్‌ల పరిచర్యలో క్రీస్తుతో ఉన్న సంబంధమే అత్యంత ముఖ్యమైనదని పోప్ స్పష్టం చేశారు. ప్రార్థన, క్రీస్తుతో సాన్నిహిత్యాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా చేసుకుని “యేసుతో ఉండాలని” కొత్త బిషప్‌లను ఆయన కోరారు.


“ప్రభువుతో గడిపే సమయాన్ని ఎల్లప్పుడూ విలువైనదిగా భావించండి: పవిత్ర యూకరిస్టు, దేవుని వాక్యం, ప్రార్థన, అలాగే తన ప్రభువు ప్రేమకు తాను లోబడే శిష్యుడి సరళమైన హృదయంతో ఆయన సన్నిధిలో ఉండగలిగే ఆ క్షణాలను ఆదరించండి” అని పోప్ అన్నారు.


“మంచి కాపరి అయిన యేసు హృదయాన్ని” పెంపొందించుకోవాలని పోప్ లియో బిషప్‌లకు సూచించారు. ఆ హృదయం పూర్తిగా తండ్రి వైపు మళ్లి, సహోదర సహోదరీలకు సంపూర్ణంగా అంకితమై ఉంటుందని ఆయన వివరించారు. ఇటువంటి కాపరి సేవకు ప్రజల జీవితాల్లోకి లోతుగా ప్రవేశించడం అవసరమని చెప్పారు.


“బిషప్ అంటే తన ప్రజలను మరింత లోతుగా ప్రేమించడం ప్రతిరోజూ నేర్చుకునే వ్యక్తి. వారి సంతోషాలు, బాధలను తెలుసుకోవడం, వారి కలలను పంచుకోవడం, సమాజాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆనందించడం ఆయన బాధ్యత” అని పోప్ అన్నారు.


ఈ సాన్నిహిత్యం బిషప్‌ల సాధారణ పరిచర్యలోని ప్రతిరోజు కలయికల ద్వారా వ్యక్తమవుతుందని ఆయన చెప్పారు. పూజారులు, డీకన్‌లకు అభిషేకాలు నిర్వహించడం, ఉత్సాహంగా ఉన్న యువతను కలవడం, కష్టాలను ఎదుర్కొంటున్నవారికి తోడుగా ఉండటం వంటి సందర్భాల్లో బిషప్‌లు తమకు అప్పగించబడిన ప్రజలను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని, వారి పేర్లు, జీవిత కథలను గుర్తించాలని సూచించారు.


ముఖ్యంగా యువ చర్చిల్లో బిషప్‌ల సాక్ష్యం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని పోప్ పేర్కొన్నారు. వారి సాధారణమైన సాన్నిహిత్యం ద్వారా కూడా చర్చి ప్రజల పట్ల చూపించే శ్రద్ధను వ్యక్తపరచవచ్చని అన్నారు. ఒక పూజారితో కొంత సమయం గడపడం లేదా ఒక కుటుంబం చెప్పేది శ్రద్ధగా వినడం వంటి చిన్న చర్యలు కూడా వారి హృదయాల్లో చెరగని ముద్ర వేయగలవని చెప్పారు.


“మీకు మిషన్ యొక్క అందం, సవాళ్లు తెలుసు. తక్కువ వనరులు ఉన్నప్పటికీ గొప్ప విశ్వాసంతో జీవించే చర్చి మీకు తెలుసు. అందువల్ల మీ మిషనరీ హృదయాన్ని కాపాడుకోండి” అని పోప్ లియో అన్నారు.


“పాస్టరల్ సొలిసిట్యూడ్” (కాపరి బాధ్యతతో కూడిన శ్రద్ధ)ను స్వీకరించాలని కూడా పోప్ బిషప్‌లను కోరారు. అంటే ప్రజలను తమ హృదయంలో మోసుకెళ్లడం, ముఖ్యంగా పూజారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం అని ఆయన వివరించారు. బిషప్‌ల పరిచర్య అంతిమంగా “ప్రేమకు సేవ” అని, అది సువార్త బోధన, ప్రార్థన, వివేచన, ఇతరులకు అందుబాటులో ఉండటం ద్వారా వ్యక్తమవుతుందని చెప్పారు.


కొత్త బిషప్‌లు తమ పరిచర్యను కొనసాగించాల్సిన వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ప్రస్తావిస్తూ, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పోప్ లియో గుర్తుచేశారు. సాంకేతిక అభివృద్ధి మానవ జీవితాన్ని మార్చుతున్నప్పటికీ, పాపం మరియు దాని పరిణామాల నుంచి మానవాళిని సాంకేతికత విముక్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరికీ రక్షణ సువార్తను ప్రకటించడం చర్చి కొనసాగించాల్సిన బాధ్యత అని అన్నారు.


తన “మాగ్నిఫికా హ్యూమానిటాస్” ఎన్సైక్లికల్‌పై ప్రజలు ఆలోచించేందుకు, సంభాషించేందుకు అవకాశాలను సృష్టించాలని కూడా పోప్ బిషప్‌లను కోరారు. ఆ పత్రంలో ప్రతిపాదించిన దృష్టికోణానికి అనుగుణంగా ప్రేమతో కూడిన నాగరికత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు.


విశ్వాసం లేని వారితో సహా ప్రతి ఒక్కరి పట్ల తమ హృదయాలను తెరిచి ఉంచాలని పోప్ లియో కొత్త బిషప్‌లను ప్రోత్సహించారు. ప్రార్థన, పవిత్ర గ్రంథం, పవిత్ర యూకరిస్టు ద్వారా తమ ప్రజలతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు.


“మన ప్రజలతో కలిసి నడుద్దాం. వారితో కలిసి ప్రార్థిద్దాం, వారితో కలిసి దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం, వారితో కలిసి పవిత్ర యూకరిస్టును జరుపుకుందాం. ప్రతిరోజూ వారితో కలిసి ప్రభువు ముఖాన్ని అన్వేషిద్దాం” అని పోప్ లియో అన్నా

రు.


Courtesy: Vatican News

© 2026 CATHOLIC CONNECT POWERED BY ATCONLINE LLP